భారత్‌ను అమెరికా ఎంతగానో ప్రేమిస్తోందని, గౌరవిస్తోందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. మొతేరా స్టేడియంలో ప్రసంగించిన ట్రంప్ భారత ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. భారత్ తమకు ఘనస్వాగం పలికిందని, దీన్ని తాను, మెలానీయ ఎప్పటికీ మర్చిపోమని చెప్పారు.
భారత్‌ను ప్రగతి పథంలో తీసుకెళ్లేందుకు మోదీ అహర్నిషలు కృషి చేస్తున్నారని ట్రంప్ అన్నారు. ఐదు నెలల క్రితం అమెరికాలోని అతిపెద్ద ఫుట్‌బాల్ మైదానంలో మోదీకి స్వాగతం పలికామని, ఇపుడు ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మైదానంలో తమకు భారత్ స్వాగతం పలికిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ రోజునుంచి భారత్‌కు తమ గుండెల్లో ప్రత్యేక స్థానం ఉంటుందని, భారత్ ఆథిత్యం తమకు ఎంతగానో నచ్చిందని ట్రంప్ ఆనందం వ్యక్తం చేశారు.
మొతేరా స్టేడియంలో జనం కరతాళ ధ్వనుల మధ్యన ట్రంప్ మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. ఇదే నగరంలో చాయ్‌వాళాగా మోదీ తన జీవితం ప్రారంభించి ఈ స్థాయికి చేరుకున్నారన్నారు. మోదీ జీవితం ఎంతో మందికి ఆదర్శమని చెప్పారు. మోదీ నా నిజమైన స్నేహితుడు. ఆయన ఎంతో నిక్కచ్చిగా వ్యవహరిస్తారు. అద్భుత విజేతగా భారత్ అభివృద్ధికి కృషి చేస్తున్నారంటూ మోదీని పొగడ్తల్లో ముంచేశారు.
70 ఏళ్లలోనే భారత్ అద్భుత శక్తిగా ఎదిగిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ప్రపంచానికి భారత్ ఎదుగుదల ఓ మార్గదర్శకమని ఆయన స్ఫష్టం చేశారు. పారిశుధ్యం, పేదరిక నిర్మూనలో భారత్ ఎంతో పురోగతి సాధిస్తుందని, అద్భుత అవకాశాలకు నెలవని కొనియాడారు.