ఐటీ ఉద్యోగులు ఆత్మవిశ్వాసం వీడొద్దు

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలోని ఉద్యోగులు ఆత్మవిశ్వాసం వీడొద్దని, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే ధైర్యంతో ఉండాలని, సాంకేతిక అంశాలపై పట్టు పెంచుకోవాలని ఐటీ నిపుణులు, వక్తలు పిలుపునిచ్చారు. ఆర్థిక మాంద్యం కోణంలో ఐటీ ఉద్యోగుల తొలగింపుపై ఎలా వ్యవహరించాలి అనే అంశంపై ఆదివారం హైదరాబాద్‌లో టీటా (తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్) ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాలా మీడియాతో మాట్లాడుతూ.. ఐటీ పరిశ్రమలో ఆర్థిక మాంద్యం ప్రభావం, టెక్నాలజీ అప్‌డేట్లు, ఆటోమేషన్ వంటి అంశాలపై సమావేశంలో చర్చించినట్టు చెప్పారు.


సంవత్సరాంతం మదింపు కాలం (ఇయర్‌ఎండ్ అప్రైజల్ పీరియడ్) పేరుతో, సంస్థల పనితీరు బాగాలేదనే కారణంతో ఉద్యోగుల తొలగింపు సరికాదని అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టు ఒప్పందాల కారణంగా తొలగించాల్సివస్తే ఉద్యోగులకు వివరించాలని, 6 నెలల జీతం చెల్లించాలని తెలిపారు. వారాంతాల్లో పనిచేయించుకోవడం మంచిదికాదని, అంతర్గత బృందాల ద్వారా లైంగిన వేధింపులను నిరోధించాలని చెప్పారు. ప్రభుత్వం ఐటీ పరిశ్రమకు మరింత సహాయం అందించాలని, ఐటీ ఉద్యోగుల నుంచి ఆదాయం సమకూరుతున్నందున వారికోసం ఉద్యోగుల సంక్షేమనిధిని ఏర్పాటుచేయాలని విజ్ఞప్తిచేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని, ఉద్యోగాలు కోల్పోయిన టెకీలకు ఇందులో అవకాశం కల్పించి తిరిగి ఉద్యోగం పొందేలా చూడాలని కోరారు.


ఉద్యోగులు నైపుణ్యాలను మెరుగుపరుచుకొని, అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఇతరులకు ఉద్యోగాలు కల్పించేస్థాయికి ఎదగాలని చెప్పారు. ఉద్యోగుల తొలగింపు విషయంలో సంస్థలు మానవతా దృక్పథంతో ఆలోచించాలని కోరారు. కృత్రిమ మేధస్సు (ఏఐ), త్రీడీ ప్రింటింగ్, రోబోటిక్స్, ఐవోటీ, బ్లాక్‌చైన్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, సర్వర్‌లెస్ కంప్యూటింగ్, వర్చువల్ రియాలిటీ, డ్రోన్ టెక్నాలజీ వంటి సాంకేతికతలపై ఉద్యోగులు పట్టుసాధించాలని సూచించారు. సమావేశంలో మానసిక నిపుణులు సీ రవీందర్, పలు ఐటీ సంస్థల ప్రతినిధులు అశ్విన్‌చంద్ర, నవీన్ చింతల, శ్రీలత చింతల, వెంకట్ వనం, ప్రదీప్ నీలగిరి, రవిచంద్ర మోడం, వామన్, రమ్య, వివేక్, నిర్మల్, విద్యాధర్ తదితరులు పాల్గొన్నారు.